: మీడియాలో మనం హైలైట్ అవ్వాలంటే వాళ్లకు రివర్స్‌లో చెప్పాలి: ‘బీకాంలో ఫిజిక్స్’పై జలీల్ ఖాన్
టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఈ రోజు అమరావతిలోని ఏపీ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాతో సరదాగా మాట్లాడి ఆయనను టీడీపీలోకి వచ్చేయమన్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన మరో వైసీపీ ఎమ్మెల్యే సునీల్ తో కూడా మాట్లాడడం విశేషం. ఈ సందర్భంగా ఆయన తాను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ హైలైట్ అయిన విషయం గురించి కూడా మాట్లాడారు. కొన్ని నెలల క్రితం ఆయన ఓ వెబ్‌ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను పలకరించిన సునీల్ ‘బీకాంలో ఫిజిక్స్ అన్నా’ అంటూ చేయి కలిపారు. జలీల్ ఖాన్‌ను ఆయన అలా పిలవడంతో అక్కడున్న వారు పెద్దగా నవ్వేశారు.
ఈ సందర్భంగా సునీల్‌తో జలీల్ ఖాన్ మాట్లాడుతూ మీడియాలో హైలైట్ అవ్వాలంటే వాళ్లకు రివర్స్‌లో చెప్పాలని అన్నారు. మనం పలు విషయాల్లో ఎంత మాట్లాడినా మీడియాలో కొంచెం కూడా చూపరని జలీల్ ఖాన్ పేర్కొన్నారు. తాను వారికి రివర్స్‌గా చెబితే మాత్రం రావలసిన దానికన్నా ఎక్కువ ప్రచారం వచ్చిందని చమత్కరించారు.