: మీరు 35 ఏళ్లకు పైబడిన టెక్కీయా?... మీ ఉద్యోగం ఊడిపోవచ్చు సుమా!


ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ రంగం మెరుగైన అభివృద్ధిని సాధించడంలో విఫలమవుతున్న వేళ, ఓ వైపు యాంత్రీకరణ పెరిగిపోతూ, సరికొత్త డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి వస్తుండగా, ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న సాంకేతికతకు బదలాయింపులో భాగంగా, ఉన్న ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ఐటీ కంపెనీలకు క్లిష్టతరంగా మారిందని నాస్కామ్ అంచనా వేస్తూ, భారత ఐటీ రంగంలో 15 లక్షల మంది ఉద్యోగులు మరోసారి శిక్షణ తీసుకుంటేనే విధులు నిర్వహించగలిగే పరిస్థితి ఉందని, అంతకన్నా, వీరిని తొలగించడమే మేలని కంపెనీలు భావిస్తున్నాయని పేర్కొంది. ఇందులో భాగంగా 35 సంవత్సరాలు దాటిన టెక్నాలజీ నిపుణులను విధుల నుంచి తొలగించే ప్రయత్నాలు దాదాపు అన్ని కంపెనీల్లో జరుగుతున్నాయని పేర్కొంది.

సాధారణంగా ఐటీ కంపెనీల్లో ప్రధాన బాధ్యతలను పదేళ్లకు పైగా అనుభవమున్న ఉద్యోగులకు కేటాయిస్తుంటారు. ఇప్పుడు వీరి పనులను చేయడానికి యంత్రాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఉదాహరణకు, క్యాప్ జెమినీ సంస్థ, వివిధ ప్రాజెక్టులను కింది స్థాయి ఉద్యోగులకు అప్పగించి, వారెలా విధులను నిర్వహిస్తున్నారో పర్యవేక్షించేందుకు ఐబీఎం తయారు చేసిన కాగ్నిటివ్ కన్సల్టింగ్ టూల్ 'వాట్సన్'ను వాడుతోంది. అంటే వాట్సన్ టూల్, ఓ టీమ్ లీడర్ బాధ్యతలను నిర్వహిస్తున్నట్టు. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ల పనుల పర్యవేక్షణకు స్వయంగా ఓ యంత్రాన్ని తయారు చేసుకుంది. మరిన్ని వైవిధ్య భరితమైన నిర్ణయాలు, కింది ఉద్యోగుల మధ్య సమన్వయం, సమయానుకూలంగా ప్రాజెక్టుల పూర్తి తదితరాల్లో ఇది చక్కగా పనిచేస్తుండటంతో, అధిక వేతనాలు ఇచ్చి పదేళ్లు దాటిన ఉద్యోగులు అవసరం లేదని సంస్థ భావిస్తోంది.

ఐటీ సంస్థల్లో 60 నుంచి 65 శాతం మంది ఉద్యోగులు మారుతున్న కాలానికి అనుగుణంగా పనిచేసేందుకు అనర్హులుగా ఉన్నారని, వీరికి శిక్షణ అత్యవసరమని క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కందుల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులకు శిక్షఇ ఇచ్చే అవకాశాలు లేవని తేల్చి చెప్పిన ఆయన, మధ్య, ఉన్నత ఉద్యోగుల్లో అత్యధికులను తొలగించక తప్పని పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ, ఐటీ కంపెనీలు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తే, అందుకు కోట్ల కొద్దీ ధనాన్ని వెచ్చించాల్సి వుంటుందని మానవ వనరుల విభాగం నిపుణులు భావిస్తున్నారు. అంతకన్నా, ముందే శిక్షణ పొందిన ఎంట్రీ లెవల్ ఉద్యోగులను తీసుకోవాలన్న ఆలోచనలో ఐటీ కంపెనీలు ఉండటంతో, ఉద్యోగాల్లో భారీ కోత, అందునా 35 ఏళ్లు దాటిన టెక్ నిపుణుల మెడపై కత్తి ఖాయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News