: విమానంలో ఎయిర్ హోస్టెస్ కు వైద్యసాయం.. తన భార్య చేసిన పనికి గర్వంగా ఉందన్న ఇండియన్!
కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం ప్రయాణిస్తున్న వేళ, ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైతే, ఆ సమయంలో విమానంలో ఓ వైద్యుడో, వైద్యురాలో ఉండి స్పందించి ప్రాణాలు నిలిపితే, నిజంగా వారు దైవంతో సమానంగా కనిపిస్తారు. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుంచి కౌలాలంపూర్ కు ప్రయాణిస్తున్న విమానంలో ఎయిర్ హోస్టెస్ గా ఉన్న యువతి స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితిలో, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలంటే, గంటల సమయం పడుతుందన్న వేళ, ఓ భారత వైద్యురాలు చూపిన చొరవ ఎయిర్ హోస్టెస్ ప్రాణాలు కాపాడింది.
వైద్యులెవరైనా ఉంటే సాయం కావాలని విమాన సిబ్బంది కోరగా, వెంటనే స్పందించిన తన భార్య డాక్టర్ అంచిత చేసిన చికిత్స గురించి వివరిస్తూ, ఆమె భర్త కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టుపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎయిర్ లైన్స్ క్రూ ప్రకటనకు తన భార్య ఒక్కరే స్పందించారని, విమానంలోని మెడికల్ కిట్టుతోనే ఆమెకు వైద్యం చేసి స్పృహ తెప్పించారని ఆయన తెలిపారు. అందుకు తానెంతో గర్వపడుతున్నట్టు వెల్లడించారు. ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయాలంటే, కనీసం గంట సమయం పడుతుందన్న వేళ, తన భార్య చికిత్సకు ఆమె స్పందించారని, ఆపై ప్రయాణికులు చప్పట్లతో అభినందనలు తెలుపగా, పైలట్, తన సీటు వద్దకు వచ్చి మరీ కృతజ్ఞతలు చెప్పాడని అన్నారు.