: ఇప్పుడు న్యూజిలాండ్ వంతు... ఇండియన్ ను వెళ్లిపోవాలని అసభ్య తిట్లు!
ఓ వైపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత, భారతీయులపై విద్వేష పూరిత దాడులు పెరిగిన వేళ, న్యూజిలాండ్ లో సైతం అదే తరహా ఘటనలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ లో ఓ సిక్కు యువకుడిపై స్థానికుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది. నరీందర్వీర్ సింగ్ అనే యువకుడు, తన కారును పార్కింగ్ నుంచి తీస్తుండగా, ఓ జంట మరో వాహనంలో వచ్చిన సమయంలో, ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
కారు నడుపుతున్న వ్యక్తి నరీందర్వీర్ ను తమ దేశం విడిచి వెళ్లాలని బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించినట్టు సమాచారం. వారు వెళ్లిపోయేటప్పుడు తాను పక్కకు తప్పుకున్నానని, కారులోని యువతి తనవైపుకు వేలు చూపించగా, అతను తిట్ల దండకానికి దిగాడని, చాలా అవమానకరంగా మాట్లాడాడని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనను తాను వీడియో తీయగా, అతను మరింత రెచ్చిపోయాడని చెప్పాడు. కాగా, మరో ఘటనలో విక్రమ్ జిత్ సింగ్ అనే వ్యక్తిపై స్థానికుడు అసభ్యంగా మాట్లాడుతూ, ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని బెదిరించినట్టు తెలుస్తోంది. తాజా ఘటనలతో న్యూజిలాండ్ లోని ఇండియన్ కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.