: పుజారా, అజింక్యా నిలబడ్డారు...126 పరుగుల ఆధిక్యంలో భారత్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బోర్డర్ అండ్ గవాస్కర్ పేటీఎం ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తడబడి నిలబడింది. తొలి ఇన్నింగ్స్ లో పేలవంగా ఆడి విమర్శలపాలైన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ కేఎల్ రాహుల్ మరోసారి భారత బ్యాటింగ్ ను ఆదుకున్నాడు. అర్ధసెంచరీతో రాణించిన రాహుల్ సహచరులతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలో రాహుల్ (51) రాణించగా, అభినవ్ ముకుంద్ (16), విరాట్ కోహ్లీ (15), రవీంద్ర జడేజా (2) లు విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా మిస్టర్ డిపెండబుల్స్ ఛటేశ్వర్ పుజారా (73), అజింక్యా రహానే (40) ఆసీస్ బౌలర్ల సహనాన్ని, సామర్థ్యాన్ని పరీక్షించారు.
వీరిద్దరినీ విడదీసేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టులోని బౌలర్లందర్నీ ప్రయోగించాడు. తొలి ఇన్నింగ్స్ హీరో నాధన్ లియాన్ కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో పుజారా, రహానేలు 203 బంతుల్లో 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత జట్టు 72 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దీంతో 126 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్ వుడ్ మూడు వికెట్లతో రాణించగా, ఒకీఫ్ ఒక వికెట్ తీసి అతనికి సహకారమందించాడు.