: ఫొటోల లీక్ వ్యవహారంలో ఎవరో ఉన్నారు!: హీరో ధనుష్ సోదరి విమల గీత
గాయని సుచిత్రా కార్తీక్ కుమార్ ట్విట్టర్ ఖాతా నుంచి సెలబ్రెటీల వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలలో ప్రముఖ నటి త్రిషతో హీరో ధనుష్ క్లోజ్ గా ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారాయి. ఈ విషయమై ధనుష్ స్పందించకపోయినప్పటికీ, అతని సోదరి విమల గీత మాత్రం తన దైన శైలిలో ఓ పోస్ట్ చేశారు. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ సుదీర్ఘ లేఖ రాశారు.
ఆ లేఖలోని విషయాలు... గత కొన్ని నెలలుగా తమ కుటుంబం రకరకాల వివాదాలతో బాధపడుతోందని, అయినా, తమ కుటుంబం మౌనంగానే ఉందన్నారు. మొదట్లో తాము చాలా పేద కుటుంబానికి చెందిన వారమని, ఒక వ్యక్తి కష్టంతో ఈ రోజున తాము ఉన్నత స్థితిలో ఉన్నామని చెప్పారు. తేనీ లోని ఓ గ్రామానికి చెందిన తమ కుటుంబం ఎన్నో బాధలను అనుభవించిందని, తమ సోదరులు ఎన్ని అవమానాలు భరించారో, ఆ దేవుడికే తెలుసని అన్నారు. తమ కుటుంబం విలువలకు కట్టుబడి బతుకుతోందని అన్నారు. ఈ రోజున ధనుష్ పెద్ద స్టార్ అని, ఈ స్థాయికి రావడానికి ధనుష్ ఎంత కష్టపడ్డాడో తోడబుట్టిన దానిగా తనకు తెలుసని అన్నారు.
మనుషుల క్యారెక్టర్ ను తప్పుబట్టడం మీడియాకే సాధ్యమని మండిపడ్డారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లు వేదికగా ఏదైనా మాట్లాడటానికి, పోస్ట్ చేయడానికి కొంత మంది దిగజారారని అన్నారు. ఫేక్ వీడియోల గురించి తమ కుటుంబాన్ని ప్రశ్నించడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న విమల గీత, ఈ విషయమై తాను చాలా అసహనంగా ఉన్నానని .. తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలకు గుడ్ బై చెబుతున్నానని, ఈ విధంగా చేస్తున్నది ఏ ఒక్కరినీ ఉద్దేశించి కాదని అన్నారు.
ఫొటోల లీక్ వ్యవహారం వెనుక ఎవరో ఉన్నారని, ఈ చర్యల వల్ల ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే వారి ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, ఇకనైనా దీనికి పుల్ స్టాప్ పెట్టాలని ఆమె ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. కొసమెరుపేమిటంటే, ఫేస్ బుక్ లో తన పోస్ట్ ను విమల గీత తొలగించడం జరిగింది!