: భువనేశ్వరిపైన, నాపైన భర్తల ఒత్తిడి ఎంతో ఉండేది: పురందేశ్వరి
వ్యక్తిగతంగా తన సోదరి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో ఎలాంటి విభేదాలు, గొడవలు లేవని, ఇదే సమయంలో తమ భర్తలు రాజకీయాల్లో కొనసాగుతున్న వేళ, వారు తీసుకునే నిర్ణయాలు చూపే ఒత్తిడి తమపై ఉండేదని బీజేపీ నేత, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. సోదరితో తన బంధంపై అంతకుమించి ప్రభావం చూపించిన అంశాలేవీ లేవని అన్నారు. అక్కా చెల్లెళ్లుగా తామెన్నడూ గొడవలు పడలేదని అన్నారు. ఇప్పటికీ తాము మానసికంగా సన్నిహితంగా ఉన్నప్పటికీ, ప్రొఫెషనల్ జీవితానికి వస్తే, కాస్తంత దూరంగానే ఉండాల్సి రావడం తనకు కొంత బాధ కలిగిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే సమయంలో, తన సన్నిహితులు టీడీపీలోకి రావాలని కోరారని, అయితే, తాను జాతీయ పార్టీలో ఉండాలన్న కోరికతోనే బీజేపీలో చేరినట్టు స్పష్టం చేశారు. తనను ఆహ్వానించే విషయంలో చంద్రబాబు మనసులో ఏముందో తనకు తెలియదని చెప్పారు.