: మెర్సిడిస్ బెంజ్ చరిత్రలో తొలిసారి... 10 లక్షల కార్ల రీకాల్
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిస్ బెంజ్ ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. 2015 నుంచి 2017 మధ్య కాలంలో తయారు చేసిన సీ క్లాస్, ఈ క్లాస్, సీఎల్‌ఏ, జీఎల్‌ఏ, జీఎల్‌సీ మోడళ్లకు చెందిన వాహనాల్లో ఇంజన్ వేడెక్కి అగ్నిప్రమాదాలు జరుగుతున్నట్టు భావిస్తున్న నేపథ్యంలో వీటిని రీకాల్ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఒక్క అమెరికాలోనే ఏకంగా 3.08 లక్షల కార్లను సంస్థ రీకాల్ చేయడం గమనార్హం. ఇటీవలి కాలంలో 51 బెంజ్ కార్లలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం వెనుక ఇంజన్, ట్రాన్స్ మిషన్ సమస్యలు ఉన్నాయని గుర్తించిన సంస్థ, కార్ల యజమానులందరికీ సమాచారం ఇస్తామని, జూలైలోగా విడిభాగాలను అందిస్తామని, సుమారు గంట సమయంలో సమస్యను సరిచేసి ఇస్తారని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ఇంత పెద్దమొత్తంలో కార్లను రీకాల్ చేయడం బెంజ్ చరిత్రలో ఇదే తొలిసారి.