: మహిళలు బలహీనులు, తెలివి తక్కువ వారు!: ఈయూ పార్లమెంటులో నోరు పారేసుకున్న సభ్యుడు
ఈయూ పార్లమెంట్లో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసంపై చర్చ జరుగుతున్న వేళ జానుస్ కొర్విన్ మిక్కీ (పోలండ్) అనే ఇండిపెండెంట్ సభ్యుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ప్రపంచం అంతా మహిళా సాధికారత అంటూ ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈయూ పార్లమెంటులో ఆయన ప్రసంగిస్తూ.. మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువే సంపాదించాలని అన్నారు. 'ఎందుకంటే మహిళలు బలహీనులు, చిన్నవాళ్లు, తెలివి తక్కువ వారు' అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మహిళలపై చేసిన ఈ కామెంట్స్‌కు ఓ మహిళా ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు పార్లమెంట్‌కు రావడం మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తున్నదన్న విషయం అర్థమైందని ఆమె ఆయనపై మండిపడ్డారు. యూరోపియన్ మహిళల హక్కుల్ని రక్షించేందుకు తాను సభకు వచ్చినట్లు ఆమె వ్యాఖ్యానించారు. సదరు ఎంపీ చేసిన వ్యాఖ్యలను సిగ్గుచేటుగా ఆమె అభివర్ణించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో నిబంధనల ప్రకారం ఆ వ్యాఖ్యలపై విచారణ ప్రారంభమైంది. ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని తేలితే ఆయన జరిమానా లేదా సస్పెన్షన్ ఎదుర్కుంటారు.