: అసభ్య వీడియోలు పంపుతూ బాలీవుడ్ నటికి లైంగిక వేధింపులు
బాలీవుడ్ అలనాటి నటి రాణి సోనూ వాలియా(53)కు గుర్తుతెలియని వ్యక్తి ఒకరు తరచూ ఫోన్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడడంతోపాటు అసభ్య వీడియోలు పంపిస్తున్నాడంటూ ఆమె ముంబై పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న బంగూర్నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్న అలనాటి కలల రాణి సోనా వాలియా ‘ఖూన్ భరీ మాంగ్’ వంటి హాట్ చిత్రాల్లో నటించారు.
వారం రోజుల నుంచి తనకు వేధింపులు వస్తున్నాయని, హెచ్చరించినా ఫలితం లేకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించినట్టు సోనూ తెలిపారు. ఫోన్ చేసిన ప్రతిసారి అతడు నంబర్లు మార్చాడని, ప్రస్తుతం అవి పనిచేయడం లేదని ఇన్స్పెక్టర్ శిరీష్ గైక్వాడ్ తెలిపారు. మరోవైపు ముంబైకే చెందిన బీజేపీ నాయకురాలు షైనా ఎన్సీకి కూడా వేధింపులు వస్తున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిన ఆమెకు గత కొన్ని రోజులుగా ఓ వ్యక్తి అసభ్యకర సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు. ఈమేరకు ముంబై బీకేసీలోని సైబర్ క్రైం విభాగంలో ఆమె ఫిర్యాదు చేశారు.