: మోసాలకు పాల్పడ్డ మాజీ మంత్రి పీఏ అరెస్టు!


ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత కిల్లి కృపారాణి  పీఏ సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీసులు తెలిపిన వివరాలు.. విశాఖ ఓడరేవుల మండలిలో సభ్యుడి పదవి ఇప్పిస్తానంటూ కొత్తపేటకు చెందిన రమేష్ అనే వ్యక్తిని సత్యనారాయణ నమ్మించాడు. ఈ పదవి ఇప్పించేందుకు గాను అతని నుంచి రూ. 60 లక్షలను రెండు విడతలుగా తీసుకున్నాడు. ఓడ రేవుల మండలి సభ్యుడిగా రమేశ్ ను నియమించినట్లు ఓ నకిలీ నియామక పత్రాన్ని సత్యనారాయణ సృష్టించాడు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంతకం చేసినట్టు ఉన్న ఈ నకిలీ పత్రాన్ని రమేశ్ కు అందజేశాడు. అయితే, ఈ నియామక పత్రాన్ని చూసిన రమేశ్ కు అనుమానం రావడంతో ఈ విషయమై చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు, సత్యనారాయణపై నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడింది. సత్యనారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని నుంచి రూ.7.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో మరికొంత మందిని నమ్మించి సత్యనారాయణ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కాగా, శ్రీనగర్ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ లో సత్యనారాయణ నివసిస్తాడు. 

  • Loading...

More Telugu News