: ఆర్బీఐ తీసుకోదట... ఆ నోట్లు ఇకపై వేయవద్దు... వెంకన్న భక్తులకు టీటీడీ వేడుకోలు
ఆపదమొక్కుల వాడికి భక్తులు సమర్పించిన రద్దయిన నోట్లను తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరించలేదని టీటీడీ ఈఓ సాంబశివరావు తెలిపారు. భక్తులు ఇకపై రద్దయిన నోట్లను హుండీలో వేయవద్దని, అవి స్వామివారికి ఎందుకూ ఉపకరించవని ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. జూలై నెల ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసిన ఆయన, నోట్ల రద్దు తరువాత ఇప్పటివరకూ 8.29 కోట్ల విలువైన పాత నోట్లు హుండీకి వచ్చాయని, వాటిని మార్చాలని ఆర్బీఐని కోరగా, తాము తీసుకోబోమన్న సమాధానం వచ్చిందని ఆయన వివరించారు. ఇకపై భక్తులు రద్దయిన నోట్లను స్వామివారికి సమర్పించవద్దని సూచించారు. కాగా, ఈ ఉదయం 11 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల కాగా, సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, నిజపాదదర్శనం, విశేష పూజ, అష్టదళ పాద పద్మారాధన సేవల టికెట్లు నిమిషాల్లో అయిపోయాయి. ప్రస్తుతం కల్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు అందుబాటులో ఉన్నాయి.