: లైన్ మెన్ పై పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం!
విద్యుత్తు బిల్లు కట్టాలని అడిగిన లైన్ మెన్ పై రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, బండ బూతులు తిట్టారు. ‘ఎమ్మెల్యే ఇంటికే కరెంట్ కట్ చేస్తానంటావా? నువ్వెంత? నీ బతుకు ఎంత?’ అంటూ సదరు లైన్ మెన్ పై రాయడానికి వీలులేని భాషలో తిట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. విద్యుత్ బిల్లు కింద సుమారు రూ.50 వేలు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బకాయిపడ్డాడు. సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు బకాయి వసూలు నిమిత్తం లైన్ మెన్ రమేశ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు. ఎమ్మెల్యే పీఏ అశోక్ రెడ్డి, వేరే వ్యక్తులు ఉన్నారు. విద్యుత్ బిల్లు బకాయి కట్టాలని రమేశ్ కోరాడు. దీంతో, పీఏ అశోక్ రెడ్డి, అనుచరులు అతన్ని బెదిరించి పంపివేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆ తర్వాత రంగంలోకి దిగారు. సదరు లైన్ మెన్ కు ఫోన్ చేసి బండ బూతులు తిట్టారు. ఇదిలా ఉండగా, పీఏ అశోక్ రెడ్డి తనపై చేయి చేసుకున్నాడని లైన్ మెన్ ఆరోపించాడు.