: ఇక ఏపీ అసెంబ్లీలో మైకులు విరగ్గొట్టలేరు.. స్పీకర్ పై దాడి చేయలేరు: చంద్రబాబు
ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మైకులు విరగ్గొట్టలేరని, స్పీకర్ పై దాడి చేయలేరని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంత కట్టుదిట్టంగా అన్ని పనులు పూర్తి చేశామని అన్నారు. అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా తాను ఎన్నో ఏళ్లు ఉన్నానని, కానీ తాము అలా అసెంబ్లీలో విచక్షణారహితంగా ప్రవర్తించలేదని అన్నారు.
అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలి కానీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదని హితవు పలికారు. అసెంబ్లీలో హుందాగా ప్రవర్తించాలని అన్నారు. ప్రశ్నించాలి, అడగాలి కానీ మైకులు విరగ్గొట్టేలా ప్రవర్తించకూడదని అన్నారు. తన ప్రతి నిమిషం, ప్రతి గంట రాష్ట్ర ప్రయోజనాలకోసమే పనిచేస్తానని చంద్రబాబు తెలిపారు. కలిసి వస్తే కలుపుకొని వెళతానని, కలిసి రాకపోయినా అభివృద్ధి పనుల విషయంలో వెనకడుగు వేయబోమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని ఆయన అన్నారు.