: 8 కోట్లు నష్టపోయాం.. పవన్ కల్యాణ్ న్యాయం చేయాలి: నైజాం డిస్ట్రిబ్యూటర్లు
'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాతో నైజాం డిస్ట్రిబ్యూటర్లకు రూ. 8 కోట్ల నష్టం వాటిల్లిందని డిస్ట్రిబ్యూటర్లు దిలీప్ టాండన్, తరుణ్, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రతినిధులు సునీల్, ఉదయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా ద్వారా నష్టపోయిన ఇతర పంపిణీదారులకు నష్ట పరిహారాన్ని చెల్లించిన నిర్మాతలు... తమకు మాత్రం చెల్లించడం లేదని వాపోయారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ స్పందించాలని... తమకు న్యాయం చేయించాలని కోరారు.
పవన్ ను కలిసి తమ ఆవేదనను తెలుపుకునేందుకు ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నామని... కానీ, అతన్ని కలిసే అవకాశం తమకు లభించడం లేదని చెప్పారు. ఈ విషయం పవన్ దృష్టికి వెళితే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు' హక్కులను తక్కువ రేటుకే ఇచ్చి, నష్టాన్ని పూడుస్తామని చెప్పిన నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ లు... ఇప్పుడు రైట్స్ తమకు ఇవ్వకుండానే మరో డిస్ట్రిబ్యూటర్ కు అమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు.