: హైదరాబాద్ లో సంచలనం... కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తి హత్య... లొంగిపోయిన తండ్రి
తన కుమార్తె అనూషను అత్యాచారం చేసి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన గుంటి రాజేష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనూష తండ్రి శ్యాంసుందర్ రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. గత నెల 27న జరిగిన ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ లో సంచలనం కలిగించింది. రాజేష్ హత్య అనంతరం, రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్యాంసుందర్, టీవీ చానల్ తో మాట్లాడి, ఆపై ఆధిబట్ల పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.
ఓ గుడికి చైర్మన్ గా ఉన్న రాజేష్, భూ దందాలు, రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్లు, అత్యాచారాలు, బెదిరింపులకు అలవాటు పడ్డాడని, అతనికి బతికే హక్కు లేదని చెప్పాడు. అతన్ని తాను చంపలేదని, తనపై అనుమానాలు ఉన్నాయి కాబట్టి లొంగిపోయేందుకు వచ్చానని తెలిపాడు. తన కుమార్తెకు మత్తుమందిచ్చి, ఆపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడని చెప్పాడు. దాన్ని యూట్యూబ్ లో పెడతానని బెదిరిస్తూ, మానసిక హింసకు గురిచేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని వివరించాడు. రాజేష్ హత్యను ఎవరు చేశారన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుందని చెప్పాడు.
కాగా, రాజేష్ పై వివిధ పోలీసు స్టేషన్లలో 18 కేసులు విచారణ దశలో ఉన్నాయి. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న రాజేష్, ప్రస్తుతం ఓ వ్యాపారవేత్త కుమార్తెతో సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆమె నాగార్జున సాగర్ లో అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆ కేసును పోలీసులు విచారిస్తున్నారు.