: అన్ని సంవత్సరాల నంది అవార్డులను ఒకే వేదికపై ఇవ్వాలనుకుంటున్నాం: చంద్రబాబు
2012-13 సంవత్సరాలకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనున్న నంది అవార్డులను ఈ రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు నంది అవార్డుల ఎంపిక కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ రాష్ట్రంలో స్థిరపడితే బాగుంటుందని అన్నారు. చిత్ర పరిశ్రమ ఏపీలో స్థిరపడేందుకు అన్ని సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. ఇవ్వకుండా మిగిలిపోయిన అన్ని సంవత్సరాల నంది అవార్డులను ఒకే వేదికపై ఇవ్వాలన్న ఆలోచన తనలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.