: ‘రక్తం కావాలా? అమ్ముతాం’.. అంటూ ఆసుపత్రి వద్ద గంటల తరబడి కూర్చున్న బాలికలు!
తినడానికి తిండి కూడా సరిగ్గాలేక చదువుకు దూరమవుతున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న హాస్టళ్లలో వార్డెన్లు వ్యవహరిస్తున్న తీరు మరోసారి వెలుగులోకొచ్చింది. అక్రమంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఆ సొమ్ముతో జల్సా చేస్తున్నారు. విద్యార్థులు డబ్బు ఎక్కడి నుంచో తెస్తారో వారికి అనవసరం. సొమ్ము మాత్రం వారి చేతుల్లో పడాల్సిందే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్, భోపాల్‌లోని జబల్పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. అక్కడి రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్థినులను వార్డెన్లు డబ్బు డిమాండ్ చేయడంతో ఆ డబ్బు ఎక్కడినుంచి తీసుకొచ్చి ఇవ్వాలో తెలియక ఇద్దరు విద్యార్థినులు తమ రక్తం అమ్ముకోవడానిక సిద్ధపడి ఆసుపత్రికి వెళ్లారు.
అక్కడికి వచ్చీపోయే వారి వద్దకు వెళ్లి రక్తం అవసరమైతే తాము ఇస్తామని, తమకు కొంత డబ్బు కావాలని కోరుతూ గంటల తరబడి అక్కడే కూర్చున్నారు ఆ బాలికలు. వారిని గమనించిన మీడియా వారి వద్దకు వెళ్లి ప్రశ్నించగా, అసలు బాగోతం బయటపడింది. హాస్టల్లో నివసించాలంటే డబ్బులు ఇవ్వాలని వార్డెన్ డిమాండ్ చేసినట్లు ఆ బాలికలు తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని మీడియా అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో సదరు రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ట్రైబల్ గర్ల్స్ వార్డెన్‌గా పనిచేస్తున్న బైదేహీ ఠాకూర్‌ను అధికారులు విధుల నుంచి తొలగించచి విచారణ జరుపుతున్నారు.