: ఇరాన్ వాళ్లనుకుని కాల్చాను: ఆడమ్ పూరింటన్
గత నెల 22న కన్సాస్ లోని ఓ బారులో కూచిభొట్ల శ్రీనివాస్, అతని స్నేహితుడు అలోక్, మరో అమెరికన్ పై కాల్పులు జరిపిన ఆడమ్ పూరింటన్, తాను చేసిన నేరాన్ని జాన్సన్ కౌంటీ జిల్లా కోర్టు ముందు అంగీకరించాడు. 51 ఏళ్ల పూరింటన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, నేరాన్ని అంగీకరించాడు. పూరింటన్ తరఫున న్యాయవాదిగా మైఖేల్లె డ్యూరెట్ ను నియమించిన కోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇక వీరిద్దరూ ఇరాన్ జాతీయులై ఉంటారని భావించి కాల్పులు జరిపినట్టు పూరింటన్ వ్యాఖ్యానించినట్టు బార్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కాల్పుల అనంతరం మిస్సోరీ ప్రాంతంలోని క్లింటన్ ఏరియాలో ఉన్న మరో బారుకు వెళ్లిన పూరింటన్, తాను ఇరాన్ జాతీయులను కాల్చినట్టు చెప్పాడని ఆ ఉద్యోగి తెలిపాడు. పోలీసుల విచారణలో ఇతను కూడా కీలక సాక్షి. కాగా, ఈ కేసులో పూరింటన్ పై అభియోగాలు రుజువైతే, కనిష్ఠంగా 50 సంవత్సరాల జైలుశిక్ష నుంచి మరణదండన వరకూ శిక్ష పడవచ్చని సమాచారం.