: తన ఆభరణాలు తాకట్టు పెట్టి.. టాయిలెట్లు కట్టించిన మహిళ


మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తున్నప్పటికీ ఇప్ప‌టికీ న‌వీన‌భార‌తావ‌నిలో ఆ స‌దుపాయాలు లేని ఇళ్లు ఎన్నో ఉన్నాయి. వీధుల గుండా తిరుగుతూ 'మరుగుదొడ్లు నిర్మించుకుని, కాలుష్యాన్ని అరికట్టండి' అంటూ నినాదాలు చేయ‌డం వ‌ర‌కే ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు, నాయ‌కులు ప‌రిమిత‌మవుతున్నారు. మ‌రోవైపు స్వచ్ఛ భారత్ అన్న నినాదం సాకారం అయ్యేనా అన్న ప్ర‌శ్న అందరి మ‌దిలోనే ఉంది. అంద‌రి ఇళ్లల్లోనూ మ‌రుగుదొడ్ల నిర్మాణం గోడ మీద రాతలకే పరిమితం అవుతుందా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం పలువురు యువ‌తులు, మ‌హిళ‌లు గ‌ళ‌మెత్తుతున్న వార్త‌లు అంద‌రినీ మేల్కొలుపుతున్నాయి. మ‌రుగుదొడ్డి లేనిదే అత్తింట్లో కాలు పెట్ట‌బోన‌ని ఎందరో యువ‌తులు పెళ్లి సంద‌ర్భాల్లో డిమాండ్  చేసిన ఘ‌ట‌న‌లు అనేకంగా క‌నిపించాయి. అయితే, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళా సర్పంచి ఆద‌ర్శ‌వంతమైన ప‌నిచేసి అంద‌రికీ స్ఫూర్తిగా నిలిచింది. తన దగ్గర ఉన్న బంగారాన్ని కొదవపెట్టి మరీ సుమారు వందకు పైగా మరుగుదొడ్లు కట్టించింది.

స్వచ్ఛభారత్‌ కార్యక్రమమే ప్రేరణగా జాష్‌పుర్‌ జిల్లా సనా గ్రామానికి చెందిన సర్పంచి కాజల్‌రాయ్‌ మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. మొద‌ట‌ 50 టాయిలెట్లు కట్టించాలని నిర్ణయించుకున్న కాజ‌ల్‌రాయ్‌... వాటి నిర్మాణం సకాలంలో పూర్తి చేసింది. అయితే, ప్రతీ ఇంటికీ మ‌రుగుదొడ్డి ఉండాల‌ని తాను చేస్తోన్న ప్ర‌చారం ఆచ‌ర‌ణ వైపు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకొని మ‌రుగుదొడ్లు క‌ట్టించుకోవ‌డానికి డ‌బ్బులేని వారికి త‌న న‌గ‌లు తాక‌ట్టు పెట్టి సాయం చేసింది. నగల కంటే ప్రజలందరికీ టాయిలెట్‌ సదుపాయం ఉండటమే ముఖ్యమని ఆమె చెబుతోంది. ఆమెను జిల్లా అధికారిణి ప్రియాంక శుక్లా మెచ్చుకుని, ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పారు. ఆమెను అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News