: మళ్లీ మారుతున్న తమిళ రాజకీయం... ముగ్గురు మంత్రులను జైలుకు పిలిపించుకున్న శశికళ
తమిళనాడులో రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రిగా పళనిస్వామి బాధ్యతలు స్వీకరించి రెండు వారాలైనా గడవక ముందే ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ, కర్ణాటక జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ, ముగ్గురు ముఖ్యులైన మంత్రులను తన వద్దకు పిలిపించుకున్నారు. శశికళ పిలుపుతో మంత్రులు సెంగొట్టయ్యన్, బాలకృష్ణారెడ్డి, దిండిగల్ శ్రీనివాసులు ఈ ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. మరికాసేపట్లో వారు పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లి శశికళతో మంతనాలు జరపనున్నారు. తమిళనాడులో కొత్త పార్టీలు మొదలు కావడం, పన్నీర్ సెల్వంకు అనుకూలంగా దివాకరన్ వ్యాఖ్యలు తదితరాలపై వీరి మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ రభసపై ముఖ్యమంత్రికి హైకోర్టు పంపిన నోటీసుల గురించి కూడా వీరు శశికళకు వివరించి సలహాలు పొందనున్నట్టు సమాచారం.