: యాసిడ్ దాడి కేసులో హైకోర్టు తీర్పును చూసి సుప్రీం షాక్.. కింది కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం!
ఆంధ్రప్రదేశ్లో ఓ బాలికపై జరిగిన యాసిడ్ దాడి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు చూసి సుప్రీంకోర్టు షాక్కు గురైంది. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన 14 ఏళ్ల బాలికపై ఓ దుర్మార్గుడు యాసిడ్ పోశాడు. 2003లో జరిగిన ఈ ఘటనను విచారించిన కింది కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. కిందికోర్టు తీర్పుపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన హైకోర్టు కింది కోర్టు విధించిన ఏడాది శిక్షను 30 రోజులకు తగ్గించింది. దీంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పును విన్న ధర్మాసనం షాక్కు గురైంది. ‘‘ఈ కేసును హైకోర్టు విచారించిన తీరు మమ్మల్ని షాక్కు గురిచేసిందని చెప్పేందుకు మేం సంశయించడం లేదు. బాలికపై యాసిడ్ దాడి జరిగిందనడానికి వైద్యపరమైన ఆధారాలున్నాయి. దాడికి సంబంధించి బలమైన ఆధారాలున్నాయి. దోషి అని కిందికోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూనే శిక్షను తగ్గించడంలో ఎలాంటి సమర్థనా లేదు’’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును పునరుద్ధరించింది. దోషి రూ.50 వేలు, ప్రభుత్వం రూ.3 లక్షలు బాలికకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. చాలా ఏళ్ల క్రితం అనంతపురంలో జరిగిన జంట హత్యల కేసులో హైకోర్టు తీర్పును ‘మూర్ఖపు తీర్పు’గా అభివర్ణించిన సుప్రీంకోర్టు ఇప్పుడు మరోమారు విమర్శించింది.