: నటి భావన లైంగిక వేధింపుల ఘటన నన్ను భయాందోళనలకు గురిచేసింది: దీపికా పదుకొణె
నటి భావన కిడ్నాప్, లైగింక వేధింపుల ఘటన తనను ఓ వ్యక్తిగా భయాందోళనలకు గురిచేసిందని బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పేర్కొంది. ఈ రోజు ఆమె ముంబయిలో మాట్లాడుతూ... వేధింపులకు గురైన యువతి వృత్తి ఏమిటన్నది తాను ఆలోచించడం లేదని, ఆమె అనుభవించిన బాధ గురించి ఆలోచిస్తున్నానని ఆమె వ్యాఖ్యానించింది. నటికే ఇలా జరిగితే ఎలా అన్నది కాదు సమస్య అని దీపిక పేర్కొంది. ఈ ఘటన బెంగుళూరులో ఇటీవల జరిగిన ఘటనలను తలపిస్తోందని, ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టం కఠిన చర్యలు తీసుకోకపోతే మార్పు సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడింది.
దేశంలో తరచూ ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయని దీపిక ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులు ఇలాంటి నేరాలు చేసి తప్పించుకుంటున్న పరిస్థితిని గురించి చూస్తే ఆందోళనగా ఉందని చెప్పింది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన రావడానికి ఇంకా ఎన్ని దారుణాలు జరగాలని ఆమె నిలదీసింది.