: 490కి పైగా చిత్రాల్లో నటించిన హాస్యనటుడు తవకలై మృతి
తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి నవ్వులు పూయించిన, మరుగుజ్జు నటుల్లో పాప్యులర్ నటుడు తవకలై (42) అకాల మరణం చెందారు. ఆయన సుమారు 490కిపైగా చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించారు. వడపళనిలోని మురుగన్ కోయిల్ సమీపంలో ఆయన నివాసం ఉంటున్నారు. నిన్న ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు ఎంతో మంది గొప్ప నటులతో కలిసి ఆయన సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆయనకు సినీ అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపై నటిస్తూ ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది. ఈ రోజు ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.