: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శివశంకర్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పుంజల శివశంకర్ హైదరాబాద్ లో ఈ ఉదయం మరణించారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ లోని తన స్వగృహంలో సహజమరణం చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. 1929, ఆగస్టు 10న జన్మించిన ఆయన, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాలలో కేంద్ర మంత్రిగా, కేరళ, సిక్కిం రాష్ట్రాల గవర్నరుగా విధులు నిర్వహించారు. 2004లో కాంగ్రెస్ పార్టీని వీడి, ఆపై 2008లో ప్రజారాజ్యంలో చేరారు. ఆపై వయోభారం వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-59లోని స్వగృహంలో ఉంచారు. శివశంకర్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపాన్ని వెలిబుచ్చారు.