: ప్రేమికుడు మోసం చేయడం వల్లే టెలీకాలర్ సునీత ఆత్మహత్య చేసుకుంది: తేల్చిన పోలీసులు
హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టెలీ కాలర్ సునీతది ఆత్మహత్యేనని పోలీసులు ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ విఫలం కావడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడిందని గుర్తించిన పోలీసులు ఆ దిశగా వేగంగా దర్యాప్తు జరిపి ఈ రోజు నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీని గమనించిన పోలీసులు ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితుడిని శ్రవణ్‌గా గుర్తించి అతడి కోసం ఇన్ని రోజులు గాలించారు.
అనంతరం శ్రవణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో పలు విషయాలను తెలుసుకున్నారు. సునీతతో శ్రవణ్ ప్రేమ నాటకం ఆడాడని చెప్పారు. చివరికి సునీత తనను పెళ్లి చేసుకోమని అడగగా ఆరు లక్షల రూపాయల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు. అంత ఇవ్వలేని సునీత మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడిందని చెప్పారు. మరోవైపు శ్రవణ్ ఇంతకుముందు కూడా ఐదుగురు యువతులను మోసం చేశాడని పోలీసులు తేల్చారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.