: రన్‌వేపైకి వచ్చిన కుందేళ్లు.. విమానాలకి త్రుటిలో తప్పిన ప్రమాదం


అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో పెను ప్ర‌మాదం త‌ప్పింది. అక్క‌డి నుంచి ఢిల్లీకి 142 మంది ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానం, బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌ వచ్చిన ఇండిగో విమానం ఒక‌దాన్ని ఒక‌టి ఢీ కొన‌బోయాయి. అందుకు కార‌ణం ర‌న్‌వేపై ఉన్న కుందేళ్ల‌ని సంబంధిత అధికారులు తెలిపారు. ర‌న్‌వేపై కుందేళ్లు ఉన్నట్లు గ‌మ‌నించిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అప్రమత్తమవడంతో త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పారు. మొద‌ట‌ ఇండిగో విమానం ల్యాండ్‌ అయి, రన్‌వే క్లియర్‌ అయిన తర్వాత అదే రన్‌వేపై నుంచి స్పైస్‌జెట్‌ విమానం టేకాఫ్‌ అవ్వాల్సి ఉంది. అయితే, ఇండిగో విమానం పూర్తిగా వెళ్లకముందే స్పైస్‌జెట్‌కు క్లియరెన్స్‌ ఇవ్వడంతో ఈ రెండు విమానాలు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాయి.

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమాన పైలట్‌ను రన్‌వే బ్యాక్‌ట్రాక్‌పైకి రావచ్చని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్ పేర్కొన‌గా, మ‌రొక‌వైపు ఇండిగో విమానం రన్‌వే నుంచి వెళ్లిపోవాల్సి ఉండగా మధ్యలో కుందేళ్లు ఉండడంతో రన్‌వే ఎగ్జిట్‌ ట్యాక్సీ ట్రాక్‌పై ఆగింది. ఈ విష‌యాన్ని గమనించిన ఏటీసీ వెంటనే స్పైస్‌జెట్‌ విమానాన్ని ఆగిపోవాల్సిందిగా రెండు సార్లు హెచ్చరించింది. దీంతో స్పైస్‌జెట్‌ పైలట్‌ టేకాఫ్‌ను నిలిపేసి విమానాన్ని ఆపేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రమాదం జరగలేదని, రెండు విమానాల్లోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News