: కురవి వీరభద్రస్వామికి మొక్కు చెల్లించుకున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ వివిధ దేవుళ్లకు మొక్కుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఒక్కొక్క మొక్కును చెల్లించుకుంటున్నారు. మొన్న తిరుమల వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్న ఆయన... నేడు కురవి వీరభద్రస్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. వీరభద్రస్వామికి బంగారు కోర మీసాలను ఆయన సమర్పించారు. స్వామికి 20.28 గ్రాముల బంగారు మీసాలను రూ. 62,908లతో కేసీఆర్ చేయించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ తో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ లు వచ్చారు.