: శివనామ జపంతో హోరెత్తుతున్న ఆలయాలు.. మొదలైన శివరాత్రి సందడి
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి సందడి మొదలైంది. ప్రముఖ ఆలయాలన్నీ శివనామ జపంతో మార్మోగుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునే శివాలయాలకు చేరుకుని స్వామి వారికి పూజలు చేస్తున్నారు. విజయవాడలోని దుర్గాఘాట్, పద్మావతి ఘాట్ లో శివభక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అలాగే మహానంది, ఓంకారం, యాగంటి, కాల్వబుగ్గ శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. కర్నూలు సంగమేశ్వర ఆలయాన్ని దర్శిస్తున్న భక్తులు సప్తనదుల కూడలిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం పాదగయలో భక్తులు కుక్కుటేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ శివాలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వరీ ఆలయం భక్తుల శివనామ జపంతో మార్మోగుతోంది. నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్‌లో పాదరస శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజిస్తే అనంతకోటి లింగాలను పూజించిన ఫలితం వస్తుందని భక్తుల విశ్వాసం. ఇక వరంగల్‌లోని చారిత్రక వేయిస్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరుడి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. నల్లగొండ జిల్లా మేళ్లచెరువులో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు శివుడ్ని దర్శించుకున్నారు.