: 'ఆహా' అనిపించిన సాహా క్యాచ్!
పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు ఒకీఫే క్యాచ్ పై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. 81.4 ఓవర్ లో ఉమేష్ యాదవ్ సంధించిన బంతి వేగంగా దూసుకుపోయింది. స్వింగ్ అవుతున్న బంతిని అడ్డుకునేందుకు ఒకీఫే బ్యాటు అడ్డం పెట్టాడు. అది బ్యాటు ఎడ్జ్ తీసుకుని దూరంగా వెళ్లిపోతోంది. దీనిని వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అమాంతం గాల్లో గింగిరాలు కొడుతూ ఒడిసిపట్టేశాడు. బంతి బ్యాటును తాకిన 0.31 సెకెన్లలో వృద్ధిమాన్ సాహా రియాక్ట్ అయి గాల్లో బంతిని ఒడిసిపట్టిన తీరుకి ఆటగాళ్లంతా ఫిదా అయిపోయారు.
ప్రధానంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరింత ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ స్లిప్ లో ఉన్న కోహ్లీ దానికి వేగంగా రియాక్ట్ కావాలి... కానీ అంతకంటే వేగంగా కీపర్ వృద్ధిమాన్ సాహా బంతిని కుడివైపు డైవ్ చేసి పట్టుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పుడతన్ని అంతా 'ఫ్లైయింగ్ సాహా' అంటున్నారు. కైఫ్, ఆకాశ్ చోప్రా, దీప్ దాస్ గుప్తా వంటి వెటరన్ లతో పాటు రోహిత్ శర్మ కూడా ప్రశంసిస్తున్నాడు.