: గుజరాత్ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు... ముగ్గురు సభ్యులకు గాయాలు
గుజరాత్ అసెంబ్లీ యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. సభలోనే ఆ రాష్ట్ర అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో ముగ్గురు సభ్యులకు గాయాలయ్యాయి. ఆ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లాలో రైతు ఆత్మహత్యలకు కారణం ఏంటి? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధన్నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో మొదలైన గొడవ ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం వరకు వెళ్లింది. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సహాయ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు.
సభలో సభ్యులు కొట్టుకుంటుండడంతో స్పీకర్ రమణ్‌లాల్ వోరా సభను కాసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన అనంతరం ఈ గొడవకు కారణమైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమను గాయపర్చిన బీజేపీ ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ సభ్యులు చెప్పారు.