: ముందు ఇల్లు కొంటాం.. తరువాత ఆటలో మెళకువలు నేర్చుకునేందుకు కొంత వెచ్చిస్తాం: క్రికెటర్ తండ్రి
అప్పుడే డిగ్రీ పూర్తి చేసి...ఇంకా పూర్తిగా మీసాలు కూడా రాని కుర్రాడిలా ఉండే సౌతాఫ్రికా యువబౌలర్ కసిగో రబడా (21) ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంతో అతని తండ్రి స్పందించాడు. ఇంత పెద్ద మొత్తానికి తన కుమారుడు అమ్ముడుకావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడి ఆర్ధిక ఇబ్బందులన్నీ ఈ మొత్తంతో తీరిపోతాయని చెప్పారు.
ముందు రబడాకు మంచి ఇల్లు కొంటామని ఆయన చెప్పారు. మిగిలిన మొత్తంతో ఆటలో మెళకువలు నేర్చుకునేందుకు వెచ్చిస్తామని తెలిపారు. కాగా, సౌతాఫ్రికాకు రబడా స్టార్ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైవిధ్యమైన బంతులు సంధిస్తూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో రబడకు అసాధారణమైన నైపుణ్యముంది. దీంతో రబడాను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు మొగ్గుచూపాయి. ఈ పోటీలో ఢిల్లీ జట్టు అతనిని సొంతం చేసుకుంది.