: ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ ఉద్యోగాల్లో కోత
దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ తమ వృద్ధిని కొనసాగించే క్రమంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే తమ సంస్థల్లో ఈ-కామర్స్, లాజిస్టిక్స్, పేమెంట్స్ ఆపరేషన్లలో సుమారు 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తమ సంస్థ ప్రతినిధులు ఈ పనిలోనే ఉన్నారని స్నాప్‌డీల్ అధికారులు తెలిపారు. మరోవైపు రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా తమ ప్రయాణం సాగుతుందని స్నాప్ డీల్ ప్రకటించింది.
తమ కంపెనీలో ఇప్పటివరకు 8000 మంది ఉద్యోగులున్నారని, తమ సంస్థ లాభాలను కొనసాగించే నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పింది. తమ ప్రత్యర్థి కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి స్నాప్ డీల్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ప్రెష్ క్యాపిటల్ ను ఆర్జించడానికి కూడా ఆ సంస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయి. స్నాప్‌డీల్ నికర రెవెన్యూలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5 సార్లు అధికమయ్యాయి. ప్రస్తుతం దేశంలోనే లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా తమ సంస్థను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్నాప్‌డీల్ ప్రతినిధులు పేర్కొన్నారు.