: వేరే జైలుకు సైనేడ్ మల్లిక తరలింపు.. శశికళతో చనువే కారణం?
సీరియల్ కిల్లర్ సైనేడ్ మల్లిక అలియస్ కేడీ కెంపమ్మను పరప్పణ అగ్రహార జైలు నుంచి బెలగాలిలోని హిందాల్గా జైలుకు తరలించారు. భద్రతా కారణాలు చూపుతూ ఆమెను గత వారమే ఈ జైలుకి షిఫ్ట్ చేశారు. వేరే జైలుకి తరలించే విషయమై మల్లికకు ఎటువంటి ముందస్తు సమాచారం జైలు అధికారులు ఇవ్వలేదు. ఉన్నపళంగా, లగేజ్ సర్దుకోవాల్సిందిగా అధికారులు ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను తరలించిన జైలు దేశంలోనే పురాతన జైళ్లలో ఒకటి. ఈ జైలులో హత్యా నేరం కింద ఉన్న ఖైదీల సంఖ్యే ఎక్కువగా ఉంది.
అయితే, సైనేడ్ మల్లికను ఉన్నపళంగా ఇక్కడి నుంచి తరలించడానికి ప్రధాన కారణం శశికళతో ఆమె చనువుగా ఉండటమేనని తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో శిక్ష నిమిత్తం శశికళ ఈ జైలుకు వచ్చినప్పటి నుంచి సైనేడ్ మల్లిక ఆమెతో చాలా సన్నిహితంగా ఉంటోందని జైలు అధికారులు అంటున్నారు. భోజనం కోసం శశికళను ‘క్యూ’లో నిలబడనిచ్చేది కాదని, ఆమె దగ్గరికే భోజనం తీసుకువెళ్లి మల్లిక ఇచ్చేదని అంటున్నారు. దీంతో, జైలు అధికారులు అప్రమత్తమయ్యారని, ఈ నేపథ్యంలోనే మల్లికను హిందాల్గా జైలుకు తరలించారని సమాచారం.