: వలసదారులకు ఇక గడ్డుకాలం.. అమెరికా డీపోర్టేషన్ నిబంధనలు మరింత కఠినం


అమెరికాలోని వలసదారులకు మరింత కష్టకాలం ఎదురుకానుంది. సరైన పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న వారిని వెళ్లగొట్టే (డీపోర్టేషన్) ప్రక్రియకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం(డీహెచ్ఎస్) శ్రీకారం చుట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లను వేలాదిగా నియమించుకోవడం నుంచి డీపోర్టేషన్ జాబితా పరిధిని పెంచడం వరకు పలు మార్గదర్శకాలతో రెండు మార్గదర్శక జాబితాలు రూపొందించింది. దీనికి అంతర్గత భద్రత శాఖా మంత్రి జాన్ ఎఫ్.కెల్లీ సంతకం చేశారు.

వీటి ప్రకారం.. నేరాల తీవ్రతతో సంబంధం లేకుండా దేశం నుంచి వెళ్లగొట్టేస్తారు. ప్రభుత్వ పథకాలను అక్రమంగా వినియోగించుకుంటున్నట్టు తెలిసినా ఇదే పనిచేస్తారు. గతంలో ఉన్న డీపోర్టేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేయడంలో భాగంగానే తాజా మార్గదర్శకాలను రూపొందించారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం అక్రమ వలసదారులు తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు రుజువైనప్పుడు మాత్రమే దేశం నుంచి వెళ్లగొట్టేవారు. కానీ తాజా నిబంధనల ప్రకారం నేర తీవ్రతతో సంబంధం లేకుండానే డీపోర్ట్ చేస్తారు.
 
తాజా మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. డెమొక్రాట్లు, వలసదారుల హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే అమెరికాలో అడుగుపెట్టే వారి ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలు తనిఖీ చేయాలన్న డీహెచ్ఎస్ ప్రతిపాదనపైనా అమెరికాలోని ఐటీ, హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇతర దేశాలు కూడా ఇదే విధానం అవలంబిస్తే అప్పుడు అమెరికా భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News