: నిరసన ర్యాలీ నేపథ్యంలో... జేఏసీ నేత కోదండరాం ముందస్తు అరెస్టు!
ఈ రోజు నిరుద్యోగుల నిరసన ర్యాలీకి పిలుపు నిచ్చిన తెలంగాణ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాంను ముందస్తు అరెస్టు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఆయన్ని అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోదండరాం ఉన్న ఇంటి తలుపులు పగుల గొట్టి మరీ, పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కీలక నేతల అరెస్టు సమాచారంతో రాజధాని సహా రాష్ట్ర మంతటా ఉద్రిక్తత నెలకొన్నట్లయింది. అరెస్టులకు పాల్పడితే ఆయా పోలీస్ స్టేషన్లలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతామని జేఏసీ ఇప్పటికే ప్రకటించింది.
ఇదిలా ఉండగా, తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై నేడు నిర్వహించనున్న నిరసన ర్యాలీకి అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జేఏసీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగోలులో నిర్వహించుకునేందుకు కోర్టు అనుమతివ్వబోగా ఆ పిటిషన్ ను జేఏసీ ఉపసంహరించుకుంది. నిన్న సాయంత్రం కోదండరాం నివాసంలో చర్చించిన జేఏసీ ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాలను యథాతథంగా శాంతియుతంగా నిర్వహిస్తామని పేర్కొంది. ఈ నిరసన కార్యక్రమానికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్ లో మోహరించారు. ర్యాలీలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించడం జరిగింది.