: నాన్నతో ఆటో నడపడం మాన్పిస్తా, నాన్న బాధ్యతలు మోస్తా: ఐపీఎల్ లో ఊహించని ధర పలికిన హైదరాబాదీ క్రికెటర్
"నాన్న మమ్మల్ని పెంచడం కోసం 30 ఏళ్లుగా ఆటో నడుపుతున్నారు... ముందు ఆయనతో ఆటో మాన్పిస్తాను...ఆయన బాధ్యతలన్నీ భుజాన వేసుకుంటాను...కుటుంబాన్ని నేనే నడిపిస్తాను...ఐపీఎల్ వేలంలో ఎంపికవుతానని ఊహించాను కానీ, ఇంత మొత్తానికి నన్ను కొనుగోలు చేస్తారని ఊహించలేదు...ముందు నాన్న కోసం ఇల్లు కొంటాను" అంటూ ఐపీఎల్ వేలంపాటలో 2.6 కోట్ల రూపాయల ధర పలికిన హైదరాబాద్ రంజీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ చెప్పాడు.
ఐపీఎల్ కు ఎంపిక కావడంతోపాటు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడంతో బంజారాహిల్స్ పరిసరాల్లోని ఖాజానగర్ లోని సిరాజ్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. ఐపీఎల్ కు ఎంపికైనట్టు మీడియాలో వార్తలు వెల్లువెత్తగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రాక, అభినందనలతో అతని నివాసం సందడిగా మారింది. తాను తొలుత భారత్ 'ఏ'కు ఆడడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నానని, అయితే ఐపీఎల్ కు ఎంపికవడం ఆనందాన్నిచ్చిందని తెలిపాడు. ఇప్పుడు తన ముందున్న లక్ష్యం ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి, టీమిండియాలో స్థానం సంపాదించడమేనని తెలిపాడు.
డేవిడ్ వార్నర్, యువరాజ్ సింగ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, భువనేశ్వర్ కుమార్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లతో కలసి ఆడడం అదృష్టమని చెప్పాడు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ కి బౌలింగ్ చేయడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదని భావిస్తున్నానని సిరాజ్ పేర్కొన్నాడు. సిరాజ్ తోపాటు సన్ రైజర్స్ హైదరాబాదు జట్టులో తన్మయ్ అగర్వాల్ కూడా చోటు సంపాదించాడు. అతనని సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు కనీస ధర 10 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది.