: ప్రజలను ‘తలెత్తుకునేలా’ చేస్తున్న షణ్ముఖరావు గురించి పోలీసుల ఆరా!
జీవించి ఉన్నవాళ్లలో ప్రపంచంలోనే అత్యంత పొడగరిగా రికార్డులకెక్కనున్న ఇజ్జాడ షణ్ముఖరావు(24) గురించి పోలీసులు ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లానికి చెందిన ఆయన తన పొడగరితనంతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. 8.3 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే జీవించి ఉన్నవాళ్లలో అత్యంత పొడగరిగా ఖ్యాతి గాంచారు. అయితే అధికారికంగా ఇది ధ్రువీకరించాల్సి ఉంది. ఆయన గురించి మీడియాలో కథనాలు రావడంతో షణ్ముఖరావు ఒక్కసారిగా గ్రామంలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు.
పోలీసులు ఆయన గురించి ఆరా తీశారు. విషయం తెలిసిన సంతకవిటి ఎస్సై ఎస్. చిరంజీవి పొడగరి షణ్ముఖరావును పిలిపించి మాట్లాడారు. పెరుగుదల, ఆరోగ్యం, చదువు గురించి ఆరా తీశారు. ఎత్తు, బరువు వివరాలు సేకరించారు. మరోవైపు ఆయన పొడవు గురించి కథనాలు రావడంతో ఎలక్ట్రానిక్ మీడియా బిళ్లం గ్రామానికి క్యూ కట్టింది. మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. వైద్యులు కూడా షణ్ముఖరావు పొడవు గురించి ఆరా తీస్తున్నారు. కాగా గతంలో ఐదడుగల పొడవుండే షణ్ముఖరావు పచ్చకామెర్లకు మందు వాడినప్పటి నుంచి తన పొడవు విపరీతంగా పెరిగిపోయినట్టు తెలిపారు.