: కేసీఆర్ పర్యటనకు ఘనంగా ఏర్పాట్లు.. అధికారులను ఆదేశించిన ఏపీ ప్రభుత్వం
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక మొక్కులను చెల్లించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తిరుమల వెళుతున్నారు. ప్రత్యేక విమానంలో రేపు సాయంత్రం ఆయన రేణిగుంట చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ఆయన తిరుమల వెళతారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కోసం టీటీడీ యాజమాన్యం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి తిరుమల వస్తుండటంతో... ఆయనను ప్రత్యేక అతిథిగా పరిగణించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ అధికారులను ఆదేశించింది. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
కేసీఆర్ కుటుంబసభ్యులకు పద్మావతి అతిథి గృహంతో పాటు శ్రీకృష్ణలో బస ఏర్పాట్లను చేశారు. శ్రీవారి దర్శనానంతరం తన అనుచరుడు సుదర్శన్ రెడ్డి వివాహానికి కేసీఆర్ హాజరవుతారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరుచానూరు వెళ్లి మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, హైదరాబాదుకు తిరుగు పయనం అవుతారు.