: ఇదో విచిత్రం.. చనిపోయాడనుకున్న యువకుడు లేచి కూర్చున్నాడు!
కర్ణాటకలోని ధార్వాడ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం వీధికుక్క కరవడంతో కుమార్ మారేవాడ్ (17)కు తీవ్రంగా జ్వరం వచ్చింది. దీంతో అతడిని ధార్వాడ్ లోని ఓ ఆస్పత్రిలో చేర్చగా అక్కడ వైద్యులు అతడికి వైద్యం అందించారు. అయితే, కొన్ని రోజులకి ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై పెట్టారు. అతని పరిస్థితి బాగా విషమంగా ఉందని, అతడి శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించిందని చెప్పారు. వెంటిలేటర్‌పైనే ఉంచాలని చెప్పారు. అయితే, ఆ నిరుపేద కుటుంబం సదరు యువకుడిని ఇంకా ఆసుపత్రిలో ఉంచే స్తోమత లేక అతడిని ఇంటికి తీసుకెళ్లిపోయారు.
ఇంటికి తీసుకెళ్లిన కొద్దిసేపటికి అతడికి శ్వాస ఆడలేదు. శరీర కదలికలు కనిపించలేదు. దీంతో అతడు మృతి చెందాడని భావించిన అతడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి, అంతిమయాత్ర ప్రారంభించారు. మరో రెండు కిలోమీటర్లు వెళ్తే శ్మశానానికి చేరుకుంటారనగా ఉన్నట్టుండి ఆ యువకుడిలో కదలికలు కనిపించాయి. దీంతో అక్కడి జనం అంతా ఆశ్చర్యపోయారు. అతడు
చేతులు, కాళ్లు కదిలిస్తూ ఊపిరి కూడా పీల్చుకున్నాడు. దీంతో ఆ యువకుడిని వెంటనే ఆసుత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడు మెనింగో ఎన్‌సెఫలైటిస్‌తో బాధపడుతున్నట్లు భావిస్తున్నామని చెప్పారు.