: చిన్నప్పటి విశేషాలు చెబుతూ, 'ఎప్పటికీ నువ్వే మా ముఖ్యమంత్రివి' అని పన్నీర్ కు ఆశీర్వాదం!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చిన్ననాటి విశేషాలను గురించి వివరిస్తూ, ఆయనకు విద్యాబుద్ధులు చెప్పిన గురువు సతీమణి రాసిన ఓ లేఖ ఇప్పుడు తమిళనాడులో వైరల్ అయింది. దిండుకల్ సమీపంలోని నత్తం ప్రాంతానికి చెందిన ఎస్కేఏ ఈశ్వరీ అమ్మాళ్, పన్నీర్ కు చదువు చెప్పిన అయ్యాస్వామి సతీమణి. ఆమె తమిళ దినపత్రికకు విడుదల చేసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. చిన్నప్పుడు అయ్యాస్వామి వద్ద ట్యూషన్ కు వచ్చినప్పటి విశేషాలను గుర్తు చేశారు.
మిగతా విద్యార్థులు అల్లరి చేస్తున్న వేళ, పన్నీర్ బుద్ధిగా ఉన్నారని, ఏదైనా అడిగితే నెమ్మదిగా సమాధానం ఇచ్చేవారని చెప్పారు. ప్రశ్నకు సమాధానంగా 'అవును', 'కాదు' అని చెప్పేవారని, అయ్యాస్వామికి మీరు బాగా నచ్చడంతోనే ట్యూషన్ లో నాయకత్వ బాధ్యతలు మీకు అప్పగించారని గుర్తు చేశారు. ‘అయ్యా! పన్నీర్.. ఎప్పటికీ నువ్వే మా ముఖ్యమంత్రివి’ అని ఆమె అన్నారు. జయలలిత అభిమానాన్ని చూరగొన్న మీరు, మంచి పాలన సాగించాలని కోరుకుంటున్నట్టు ఆశీర్వదించారు.