: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన పాకిస్థాన్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ అఫ్రిదీ!
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, విధ్వంసకర బ్యాట్స్ మెన్ షాహిద్ అఫ్రిదీ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తన 21 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కు ముగింపు పలికాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేల నుంచి అఫ్రిదీ తప్పుకున్నాడు. 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కు అఫ్రిదీ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే, ఆ టోర్నీలో పాక్ విఫలమయింది. దీంతో, కెప్టెన్ గా తప్పుకున్న అఫ్రిదీ... జట్టులో ఆటగాడిగా కొనసాగుతానని తెలిపాడు. అయినప్పటికీ, అతనిని టీ20 జట్టులోకి ఎంపిక చేయకుండా పాక్ క్రికెట్ బోర్డు అవమానించింది. ఈ నేపథ్యంలోనే, అఫ్రిదీ తన కెరీర్ కు ముగింపు పలికాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అతనిది ఒక ప్రభంజనం. దయాదాక్షిణ్యాలు లేకుండా బౌలర్లపై విరుచుకుపడటం అఫ్రిదీ స్టైల్. 1996లో శ్రీలంకపై కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేసి... సంచలనం సృష్టించాడు. ఈ రికార్డు బద్దలు కావడానికి 17 ఏళ్లు పట్టింది. బౌలర్ గా కూడా రాణించిన అఫ్రిదీ... మంచి ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నారు. తన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇండియాలో కూడా అఫ్రిదీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
తన కెరీర్ లో మొత్తం 27 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. ఈ ఫార్మాట్ లో 1176 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 156. అంతేకాదు 48 వికెట్లు కూడా తీశాడు. వన్డేల విషయానికి వస్తే మొత్తం 398 వన్డేలు ఆడిన అఫ్రిదీ 8064 పరుగులు చేశాడు. టాప్ స్కోర్ 124 రన్స్. అంతేకాదు, 395 వికెట్లు కూడా తీసి సత్తా చాటాడు. టీ20ల్లో 98 మ్యాచ్ లు ఆడిన అఫ్రిదీ 1405 పరుగులు చేసి, 97 వికెట్లు తీశాడు.