: పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి?.. మార్షల్స్ ముసుగులో ఐపీఎస్ అధికారులు... వెలుగులోకి అవాక్కయ్యే వాస్తవాలు!
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌పై జరిగిన దాడి అనుకోని ఘటన కాదని, పథకం ప్రకారమే జరిగిందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. మార్షల్స్ ముసుగులో 9మంది ఐపీఎస్ అధికారులు సభలోకి రావడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెబుతున్నారు. వారిని అసెంబ్లీకి రప్పించి పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి చేయించారని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలను డీఎంకే సంపాదించినట్టు తెలుస్తోంది. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆదేశాలపై జరిగిన విచారణలో ఆ 9మంది ఐపీఎస్‌లను గుర్తించినట్టు సమాచారం.
స్పీకర్ సభలో లేని సమయంలో అసెంబ్లీలోకి వచ్చిన ఆ 9 మంది ఐపీఎస్‌లు స్టాలిన్‌ను బలవంతంగా ఎత్తుకుని బయట కుదేసినట్టు ఆధారాలు వెలుగు చూశాయి. అయితే సభలో విధ్వంసం జరుగుతుండడంతో అకస్మాత్తుగా వారిని రప్పించాల్సి వచ్చిందని అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్‌కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అప్పటికప్పుడు వారికి యూనిఫాంలు ఎలా వచ్చాయో చెప్పాలని డీఎంకే నిలదీస్తోంది. డీఎంకే ఆధారాలతో ముందుకు రావడంతో నిబంధనల ఉల్లంఘన కింద ఈ వ్యవహారం ఐపీఎస్‌ల మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.