: ఒకరికి తెలియకుండా ఒకరిని.. 8 మందిని పెళ్లాడిన ఘనుడు.. భార్య మౌనపోరాటం
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం బూరుగుపల్లి పంచాయతీ పరిధిలోని మట్టావానిచెరువుకు చెందిన అతడి పేరు చెల్లుబోయిన ఆంజనేయులు. వయసు 50 ఏళ్లు. కానీ అతడి గురించి తెలిసిన వారు మాత్రం అతడిని సోగ్గాడని, జల్సాలరాయుడని చెబుతుంటారు. ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఒకరిని ఏకంగా 8 మందిని పెళ్లాడాడు. చివరికి కథ అడ్డం తిరగడంతో వ్యవహారం బయటపడింది. ఆంజనేయులు ఎనిమిదో భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి మోసం బయటపడింది. దేవరపల్లి మండలం సంగాయిగూడేనికి చెందిన లక్ష్మిని 2015లో ఆంజనేయులు వివాహం చేసుకున్నాడు. అనంతరం కాన్పు కోసం భార్యను పుట్టింటిలో వదిలిపెట్టిన ఆంజనేయులు ఆ తర్వాత భార్య ముఖం చూడలేదు. బిడ్డ పుట్టినట్టు కబురుపెడితే వచ్చి రూ.500 చేతిలో పెట్టి పరారయ్యాడు.
ఫోన్లు చేసినా, మనుషులను పంపించినా స్పందన లేకపోవడంతో కుమార్తె లక్ష్మిని అతడి తండ్రి మెట్టినింటికి తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చాడు. అయితే రోజులు గడుస్తున్నా భర్త జాడ కనిపించకపోవడంతో ఆరా తీసిన ఆమె షాక్‌కు గురైంది. అతడికి ఇదివరకే ఏడు పెళ్లిళ్లు అయ్యాయని తెలిసి నిర్ఘాంత పోయింది. తండ్రి సాయంతో ఆదివారం పోలీసులను కలిసి భర్తపై ఫిర్యాదు చేసింది. గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సహకారంతో మెట్టినింటి ముందు మౌనపోరాటానికి దిగింది. పెళ్లిళ్ల బ్రోకర్లు, లాయర్ల అండతో జీవితాలతో ఆడుతూ, పిల్లల గొంతు కోస్తున్న అతడిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మి డిమాండ్ చేసింది.