: ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నా పాత్ర ఉండదని అనుకుంటున్నా: నాదెండ్ల భాస్కరరావు
‘ఎన్టీఆర్’పై తీయనున్న బయోపిక్ లో తన పాత్ర ఉండదని అనుకుంటున్నానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన తండ్రి ‘ఎన్టీఆర్’ జీవితం ఆధారంగా చిత్రాన్ని తీస్తానని బాలకృష్ణ అన్నారని, ఇందులో ఆయన జీవిత చరిత్ర అంతా చూపించాలని నాదెండ్ల కోరారు.
‘ఈ చిత్రంలో మిమ్మల్ని విలన్ గా చూపించనున్నారటగా?’ అనే ప్రశ్నకు నాదెండ్ల సమాధానమిస్తూ, ప్రతి సినిమాలో విలన్ ఉండాలనే రూల్ ఏదీ లేదని, ఆ విధంగా చేస్తే కోర్టుకు వెళతానని, అప్పుడు ఆ సినిమా రిలీజ్ ఏ విధంగా అవుతుందని అన్నారు. తనకు, బాలకృష్ణకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. బాలకృష్ణ తీయబోయే చిత్రంలో తన తండ్రి సినిమా జీవితాన్ని మాత్రమే తీసుకుంటే ఫర్వాలేదు గానీ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి తీస్తే బాలకృష్ణ చాలా చిక్కుల్లో పడతాడని అన్నారు. సినిమా తీసే ముందు బాలకృష్ణ తనను సంప్రదిస్తే, వాస్తవాలు చెబుతానని నాదెండ్ల అన్నారు.