: దుప్పి కారణంగా పెను ప్రమాదం అంచుల దాకా వెళ్లిన విమానం
ఓ దుప్పి కారణంగా అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదపుటంచుల దాకా వెళ్లి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, అమెరికన్ ఈగిల్ కు చెందిన విమానం నార్త్ కరోలినాలోని చార్లొట్టే డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో... దానికి ఓ దుప్పి అడ్డు వచ్చింది. దీంతో, విమానం నుంచి ఇంధనం లీక్ కావడం ప్రారంభమయింది. దీన్ని గుర్తించిన పైలట్ గ్రౌండ్ కంట్రోల్ కు సమాచారం అందించాడు. వెంటనే విమానాన్ని అత్యవసరంగా ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అయితే విమానం ల్యాండ్ అయ్యే సమయానికే రన్ వే మీదకు ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. రన్ వే పై విమానం ఆగిన వెంటనే... దానిపై భారీ మొత్తంలో ఫోమ్ ను స్ప్రే చేశారు. దీంతో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలోని 44 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. అయితే, రన్ వే పైకి దుప్పి ఎలా వచ్చిందనే విషయంపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.