: ఆసీస్-భారత్ 'ఏ' జట్ల మధ్య నేడే ప్రాక్టీస్ మ్యాచ్... బలాబలాలివే!
ఆసీస్-భారత్ 'ఏ' జట్ల మధ్య నేడు ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు సన్నాహకాల్లో భాగంగా టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య నేతృత్వంలోని భారత ‘ఎ’ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. టీమిండియాలో చోటు ఆశిస్తున్న యువ ఆటగాళ్లు.. హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్ వంటి అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన బౌలర్ల బౌలింగ్ లో ఆడి, తమను తాము నిరూపించుకునేందుకు ఇదో మహత్తర అవకాశం అని వెటరన్ లు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్ లో రాణించడం ద్వారా చివరి రెండు టెస్టుల్లో స్థానం దక్కించుకోవాలని పలువురు ఆటగాళ్లు భావిస్తున్నారు.
ఈ మ్యాచ్ ను టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే స్వయంగా వీక్షించనున్నారు. దీంతో రాహుల్ ద్రవిడ్ నిర్దేశకత్వంలో భారత ‘ఎ’ ఆటగాళ్లు ఈ చక్కని అవకాశాన్ని ఎలా వినియోగించుకోనున్నారో తెలుసుకోనున్నారు. దీంతో రంజీ సీజన్ లో విశేషంగా రాణించిన గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పంచల్, కీపర్ మరియు హార్డ్ హిట్టర్ రిషబ్ పంత్, ఇషాంత్ కిషన్ తో పాటు స్పెషలిస్టు బ్యాట్స్ మన్ లుగా రాణించాలని కలలు కంటున్న శ్రేయస్ అయ్యర్, అఖిల్ హెర్వాద్కర్, అంకిత బావ్నె తదితరుల ఆటతీరును ఆసక్తిగా గమనించనున్నారు.
ఈ సన్నాహక మ్యాచ్ తో ఆస్ట్రేలియా స్పిన్నర్లకు పరీక్ష మొదలవుతుంది. రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన ఆటగాళ్లంతా భారత 'ఏ' జట్టులో ఉన్నారు. వీరికి ఆసీస్ స్పిన్నర్లు స్టీవ్ ఒకీఫె, నాథన్ లియాన్, ఆస్టన్ అగర్ లు ఎలా అడ్డుకట్ట వేస్తారన్నది ఆసక్తికరం. కాగా, గత పర్యటనల్లో భారత బ్యాట్స్ మెన్ చేతిలో ఘోరంగా దెబ్బతిన్న కంగారూలు ఈ సారి అద్భుతమైన ఫాంలో ఉన్న టీమిండియా స్పిన్నర్లను ఎలా ఎదుర్కోనున్నారో తేలిపోనుంది. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య ఇదివరకే మాటల యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కాగా, రెండు జట్ల వివరాల్లోకి వెళ్తే...ఆస్ట్రేలియా జట్టు:
డేవిడ్ వార్నర్, రెన్ షా, ఖ్వాజా, షాన్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్ వెల్, స్వెప్సన్, హ్యాండ్ కాంబ్, మాథ్యూ వేడ్, నాథన్ లియాన్, ఒకీఫె, ఆస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, జాక్సన్ బర్డ్, హేజిల్ వుడ్.
భారత్ ‘ఎ’ జట్టు:
ప్రియాంక్ పంచల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అఖిల్ హెర్వాద్కర్, అంకిత్ బావ్నె, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, బాబా ఇంద్రజిత్, కృష్ణప్ప గౌతమ్, కుల్ దీప్ యాదవ్, నదీమ్, రాహుల్ సింగ్, మహ్మద్ సిరాజ్, నవ్ దీప్ సైని, అశోక్ దిండా.