: షాకింగ్... నడిరోడ్డుపై హెలికాప్టర్ ను ఆపి అడ్రస్ అడిగిన పైలట్!


పాపం.. ఆ హెలికాప్టర్ పైలెట్ కు తను వెళ్లాల్సిన అడ్రస్ తెలియలేదట. దాంతో హెలికాప్టర్ ని ఉన్నపళంగా నడి రోడ్డు మీద ల్యాండ్ చేసి, దారీపోయే వాళ్లని అడ్రస్ వాకబు చేశాడు. ఆశ్చర్యానికి గురి చేసే ఈ ఘటన కజికిస్థాన్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... కజికిస్థాన్‌ లోని ఓ జాతీయ రహదారిపై వరసగా లారీలు వాటి గమ్యస్థానానికి వెళ్తున్న సమయంలో... చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్న దశలో.. కళ్లు చించుకున్నా కానరాని రోడ్డుపై.. మంచును చీల్చుకుంటూ కజికిస్థాన్‌ ఆర్మీకి చెందిన ఎంఐ-80 హెలికాప్టర్‌ ఒకటి ఆ లారీల ముందు నడిరోడ్డుపై ల్యాండ్‌ అయింది.

ఏం జరిగిందా? అని లారీ డ్రైవర్లంతా ఆశ్చర్యానికి గురవుతున్న దశలో ఆ హెలికాప్టర్‌ నుంచి కిందికి దిగిన పైలట్‌.. నేరుగా ఓ లారీ డ్రైవర్‌ వద్దకు వచ్చి కరచాలనం చేసి, అక్తుబిన్సిక్‌ నగరానికి ఎలా వెళ్లాలని దారి అడిగాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆ లారీ డ్రైవర్‌, అంతలోనే తేరుకుని ఎలా వెళ్లాలో సూచించాడు. అతని సూచనల మేరకు హెలికాప్టర్ తిరిగి గాల్లోకి లేచి పయనమైంది. ఈ విచిత్రమైన ఘటనతో లారీ డ్రైవర్లు బిత్తరపోయారు.

మామూలుగా కారులో వెళ్లే వాళ్లు అడ్రస్‌ అడిగినట్టుగా అంత భారీ హెలికాప్టర్‌ ని రోడ్డుపై దించి చిరునామా అడగటం ఏంటని విస్తుపోయారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన కజికిస్ధాన్ రక్షణ శాఖ శిక్షణలో భాగంగా శిక్షణ పైలట్లకు గమ్యం చెప్పకుండా.. వెళ్లిన చోటును కనుక్కునేలా చేస్తామని, వారే గమ్యాన్ని కనుక్కుని చేరాల్సి ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News