: బలనిరూపణకు గడువు 15 రోజులు... 'జస్ట్ మూడు రోజులు' చాలంటున్న పళనిస్వామి!


తమిళనాడులో ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగరరావు 15 రోజుల గడువునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ మండిపడ్డారు. మరీ అంత సమయం ఇస్తే బలం నిరూపణ కష్టం కాదని, తొందరగా బలనిరూపణ జరిగేలా చూడాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పళనిస్వామి ఈ నెల 20న బల నిరూపణ చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికి, బలనిరూపణకు మధ్య మూడు రోజులే గడువు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా, తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 233 మంది సభ్యులు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

పళనిస్వామి తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ కు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన జాబితా కూడా సమర్పించారు. కాగా, పన్నీర్ సెల్వం పంచన చేరిన ఎమ్మెల్యేలలో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పళనిస్వామికి మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 8 మంది, ఐఐఎంఎల్‌ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. వీరంతా కలిసినా 98 మంది ఎమ్మెల్యేలే అవుతున్నారు. ఒకవేళ పన్నీర్ వర్గం డీఎంకేకు మద్దతిచ్చినా అధికారం చేపట్టడానికి అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో పళనిస్వామికి ఇప్పట్లో వచ్చే నష్టమేదీ లేదని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News