: ఫేస్‌బుక్‌లో కనిపించనున్న మరో అద్భుత ఫీచర్!
సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తూ కోట్లాది మంది ఖాతాదారులని సంపాదించుకుని దూసుకుపోతున్న ఫేస్‌బుక్ ఇకపై తమ వెబ్‌సైట్‌లోనే యూజర్లకు సరిపోయే ఉద్యోగాలను సెర్చ్ చేసుకునే సౌకర్యంతో పాటు, దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని తీసుకురానుంది. తొలిదశలో ఈ ఫీచర్‌ను అమెరికా, కెనడాలో తీసుకురానున్నారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొస్తారు.
ఇప్పటికే ఈ సదుపాయాన్ని లింక్డ్‌ఇన్ కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌లో కూడా ఈ సదుపాయం రానుండడంతో ఇక లింక్డ్‌ఇన్ దాని నుంచి గట్టి పోటీ ఎదురుకోనుంది. ఫేస్‌బుక్ తీసుకొస్తోన్న ఈ ఫీచర్ లో ఉద్యోగాలందించే సంస్థలు ఇకపై నేరుగా ఫేస్‌బుక్‌లో తమకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకొని తమ వద్ద ఏయే ఉద్యోగావకాశాలు ఉన్నాయో పేర్కొనవచ్చు. అంతేగాక, ఉద్యోగార్థులు తమ వ్యక్తిగత ఫేస్‌బుక్ ఖాతాలో ‘జాబ్స్’ అనే ట్యాబ్ ద్వారా ఏయే సంస్థల్లో ఏయే ఉద్యోగాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా అభ్యర్థి జాబ్‌కు దరఖాస్తు చేసుకుంటే యూజర్‌కు, కంపెనీకి అనుసంధానంగా ఓ చాట్ బాక్స్ కూడా ఏర్పాటు అవుతుంది. దీంతో ఉద్యోగార్థులు, సంస్థలు ఒకరితో ఒకరు చర్చించుకోవచ్చు. దీంతో ఉద్యోగ నియామక ప్రక్రియ సులభంగా మారుతుంది.